నల్లగొండ, ఆగస్టు 21: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని…పదేండ్లలో లేని యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధించడానికి కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.. మంత్రులకు కమీషన్ల మీద ఉన్న సోయి రైతులపై లేకపోవటం వల్లనే రైతులు పొలం పనులకు వెళ్లకుండా ఒక్క బస్తా కోసం నిద్రాహారాలు మాని లైన్లు కట్టాల్సి వస్తోందని ఆవేదనం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు గాదిరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులను నెల రోజులుగా యూరియా కొరత వేధిస్తోందని, ప్రభుత్వం ఇంకా మేలుకోకపోతే రానున్న రోజుల్లో ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టిన రైతు కనీసం ఆ పెట్టుబడి పొందాలంటే యూరియా, డీఏపీ ప్రధానం అన్నారు.
ఈ ఎరువులు సకాలంలో రైతులకు అందించలేకపోతే ఈ ప్రభుత్వం ఉన్నది దేనికని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌తోపాటు మంత్రులుగా ఉన్న తాము ప్రతీ సీజన్‌కు ముందు, సీజన్ వెనుక అధికారులతో సమీక్షలు చేస్తూ విత్తనాలు, ఎరువులు, కరెంట్, ధాన్యం కొనుగోళ్ల అంశాలపై మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేవాళ్లమని, ఇప్పుడున్న మంత్రులకు ఇది ఎందుకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్ల వల్లనే సమస్య..
మంత్రులు రైతులను పట్టించుకోకుండా కమీషన్లకు మ రిగి దళారుల పంచన చేరబట్టే సమస్యలు వస్తున్నాయన్నారు. మంత్రులు నల్లగొండలో ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ రైతుల వద్ద ధాన్యం కొనాల్సిన అవసరం లేదంటూ కమీషన్లు తీసుకున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకున్న మం త్రులు రైతులను కాళ్లు మొక్కించుకునే పరిస్థితికి తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇస్తామన్నా ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, రూ.266 ఉన్న బస్తాను బ్లాక్‌లో రూ.400 చేశారని పేర్కొన్నారు.
52 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రైతుల కోసం అదే ఢిల్లీ వెళ్లి ఎరువులు ఎందుకు తెస్తలేడని ప్రశ్నించారు. దేశానికి వెన్నెముకైన రైతు చినుకు పడితే నాగలి భుజాన వేసుకొని పొలానికి పోవాలే తప్ప అప్పులు, విత్తనాలు, ఎరువుల కోసం కాదన్నారు. నాటి సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం వల్లనే పదేండ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదన్నారు. రొటీన్‌గా వచ్చే ఎరువులే పక్కదారి పట్టడం వల్ల ఈ కొరత ఏర్పడుతోందని, పోలీసులతో యూరియా అమ్మించాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. మంత్రిగా ఫెయిలైన కోమటిరెడ్డి కనీసం తన నియోజక వర్గంలోనైనా కనీస సమస్యలు తీర్చడం లేదని, అందుకే రైతులు కరెంటు, నీళ్లు, యూరియా, ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్డు ఎక్కుతున్నట్లు తెలిపారు.
తప్పుడు ప్రకటనలు చేయిస్తున్న కోమటిరెడ్డి..
ఎగిరెగిరి పడే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యూరియా కొరత లేదంటూ అధికారులతో మాట్లాడించటమేమిటని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తూ.. అధికారులు కూడా మంత్రుల మాటలు విని తప్పుడు ప్రకటనలు చేస్తే ఇబ్బందుల పడతారని హెచ్చరించారు. యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే యూరియా కొరత లేదని ఉన్నతాధికారులు తప్పుడు ప్రకటనలు చేయటం సరికాదన్నారు. యూరియా కొరతే లేకుంటే పీఏసీఎస్‌ల వద్ద పోలీసులతో ఎందుకు అమ్మిస్తున్నారని ప్రశ్నించారు. కమీషన్లు ఇచ్చే పీఏసీఎస్‌లకు తప్ప అన్నింటికీ యూరియా ఎందుకు సరఫరా చేయటం లేదని నిలదీశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించి ఎరువులు కొరత తీర్చాలని, లేదంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, మందడి సైదిరెడ్డి, మాలె శరణ్యా రెడ్డి, సింగం రామ్మోహన్, బోనగిరి దేవేందర్, బక్క పిచ్చయ్య, జమాల్ ఖాద్రీ, బొమ్మరబోయిన నాగార్జున, దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, గుండెబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో కూర్చొని వందల కోట్ల దోపిడీ..
జిల్లాలకు రాకుండా రైతుల గురించి పట్టించుకోకుండా ఉన్న మంత్రులు హైదరాబాద్‌లో కూర్చొని వందల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నట్లు జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. వచ్చేసారి ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి దీపం ఉండగానే ఇల్లు సక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ప్రతీ పనిలో కమీషన్ తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతూ రైతులు, ప్రజలను పట్టించుకోవటం లేదన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమై రైతులు ఇబ్బందులు పడితే కనీసం సమస్య ఎక్కడుంది అనే దానిపై ఇప్పటికీ ఒక్కసారి కూడా జిల్లా మంత్రులు ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు.
మంత్రుల పట్టింపులేని తనం వల్లే సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాక రెండేండ్లు, సాగర్‌లో నీళ్లు ఇవ్వలేక గతేడాది పొలాలు ఎండిపోయాయన్నారు. కరోనా సమయంలోనే ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ చూసుకున్నారని..అప్పట్లో హమాలీల కొరత ఉంటే లారీల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కరోనా సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రం నాశనమై ఉండేదన్నారు.