అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ మాఫీ అవ్వక తీవ్ర అవస్థలు పడుతున్న రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. కొర్రీలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు చేసేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.
నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డీఓ కార్యాలయాలు లేదా తాసీల్దార్ ఆఫీసుల ఎదుట రుణమాఫీ అందరికీ ఇవ్వాలన్న నినాదంతో పెద్దఎత్తున నిరసన తెలిపేందుకు సన్నాహాకాలు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి జరిగే ధర్నాలో రైతులకు మద్దతుగా ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం మంది రైతులకు కూడా
రుణమాఫీ కాకపోవడం శోచనీయం.
ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ అమలు చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉంటారన్నది అంచనా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డును ప్రమాణికంగా తీసుకుని కుటుంబంలో ఒక్కరికే రెండు లక్షల రుణమాఫీ వర్తింప చేయడంతో దాదాపు రెండున్నర లక్షల మంది రుణమాఫీకి దూరమైనట్లు రైతు సంఘాల లెక్కలు చెప్తున్నాయి. ఇందుకు ఆధారంగా గతేడాది ఆగస్టులో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీ లెక్కలను ముందు పెడుతున్నాయి.
2018 ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ సర్కార్ 2023 ఆగస్టులో పాస్పుస్తకమే ప్రమాణికంగా రుణమాఫీ చేసింది. కేసీఆర్ పాలనలో రూ.99,999 వరకు అమలు చేస్తేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,00,518 మంది రైతులకు మొత్తం రూ.2159.77 కోట్ల రుణమాఫీ జరిగింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా రైతుల సంఖ్య తగ్గడం గమనార్హం. ఇప్పుడు మూడు విడతల్లో కలిపినా 3.39 లక్షల మంది రైతులకే లబ్ధి జరిగింది.
కేసీఆర్ హయాంలో లక్షలోపు రుణమాఫీ ఉన్న రైతుల సంఖ్య కంటే ఇది 60 వేలు తక్కువ. 2 లక్షల రుణమాఫీ అన్నాక అంతకు రెట్టింపు స్థాయిలో రైతులకు లబ్ధి జరుగాల్సింది పోయి ఇంకా తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఇక నల్లగొండ డీసీసీబీలో 58 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగింది. డీసీసీబీ పరిధిలోని 107 సొసైటీల్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 89,888 మంది ఉండగా ఇందులో రెండు లక్షల రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 52,708 మాత్రమే. ఇంకా 37,180 మంది రుణమాఫీకి నోచలేదు.
మొత్తం 499.98కోట్ల రుణాలకు గానూ రూ.279.76 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. రూ.220.22 కోట్ల రుణాల మాఫీ గురించి నేటికీ స్పష్టత లేదు. ఆర్ధిక భారం తగ్గించుకునేందుకే రుణమాఫీని మ.మ. అనిపించాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేసిందని రైతులు మండిపడుతున్నారు. రేషన్ కార్డులో ఎంత మంది ఉన్నా ఒక కుటుంబంలో గరిష్టంగా రెండు లక్షల రుణమాఫీ మించవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
రేషన్‌కార్డు లేని వారిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. దీనికి తోడు ఆధార్ సీడింగ్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న వారికి సైతం రుణమాఫీ కాలేదు. వారందరికీ ఎప్పుడు రుణమాఫీ వర్తింప చేస్తారన్నది ప్రశ్నార్థకంఆ మారింది. దాంతో బాధిత రైతులు నిత్యం బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని, రుణమాఫీ కాకపోవడానికి కారణం చెప్పడం లేదని వాపోతున్నారు. సగం మందికి చేసి సగం మందిని దూరం పెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ తలపెట్టిన రైతు ధర్నాల్లోనూ పెద్దసంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
నేటి ధర్నాకు తరలిరండి
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Jagadishreddy
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తున్నదని, రైతులంతా ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింప చేయకుండా రకరకాల కొర్రీలతో కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ అందే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.
బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. క్షేత్రస్థాయి నుంచి రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాల్లో కదం తొక్కి రైతు వ్యతిరేక ప్రభుత్వంపై రుణభేరి మోగించాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుంచే ధర్నాలు ప్రారంభం అవుతాయని, సకాలంలో తరలిరావాలని సూచించారు.