నల్లగొండ, జనవరి 21 : పథకాలు ప్రజలకివ్వాలంటే గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలని, అసలు ప్రజలకు తెల్వకుండా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా పంపడమేంటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేరుకు గ్రామ సభలు అని పెట్టి ప్రభుత్వం ఇచ్చిన జాబితాలు చదవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయా జాబితాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లతోనే సిద్ధమై వచ్చినట్లు తెలిపారు.
అధికారులు, ప్రజలకు సంబంధం లేకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ జాబితాలను ప్రజలు వ్యతిరేకించి ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులు చెత్తకుప్పలో వేసిన ప్రభుత్వం, ప్రజలకు సంబంధం లేకుండా జాబితాలు సిద్ధం చేశారని, ఈ విషయం ఇవ్వాల జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన నిరసనలతో తేటతెల్లం అయ్యిందని చెప్పారు. ఏడాదిలో రూ.1.40లక్షల కోట్లు అప్పు తెచ్చి పథకాల పేరుతో ప్రజలకు సగం కూడా ఇవ్వకుండా, కమీషన్లు దండుకోని ఢిల్లీకి పంపిస్తున్నట్లు ఆరోపించారు. రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం తులం బంగారం, కేసీఆర్ కిట్, 24గంటల కరెంట్ లాంటి వాటన్నింటినీ నిలిపివేసిందన్నారు.
రాష్ట్రంలో ఏడాది కాలంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ఇటీవల కాలంలో భౌతిక దాడులకు తెర తీసిందని మండిపడ్డారు. నల్లగొండలో కోమటిరెడ్డి కావాలనే కుట్రతోనే భూపాల్ రెడ్డిపై దాడి చేయించాడని, అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గూండాలకు ఏం పని అని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు కట్టినప్పుడు అనుమతి తీసుకోకపోతే నోటీస్ ఇవ్వాలని, లేదంటే ట్యాక్స్ కట్టమని చెప్పాలని, కానీ సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. సోయి లేకుండా కోమటిరెడ్డి చెప్పిన మాటలు విని అడ్డగోలుగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు.
వాస్తవంగా ఈ నెల 12న పెట్టాల్సిన రైతు ధర్నా పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ ఉంటుదన్న పోలీసుల సూచనతోనే ఈ నెల 21కి మార్చితే 21న కూడా అనుమతి ఇవ్వకుండా కోమటిరెడ్డి కుట్ర పన్నాడని, ఎట్టి పరిస్తితుల్లోనూ కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని నల్లగొండలో పెద్ద ఎత్తున రైతు మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. తాము ధర్నా చేస్తామంటేనే ప్రభుత్వానికి భయం పట్టుకుందని, గ్రామ సభల్లో ఊరూరా నిలదీస్తున్న ప్రజలు ఒక దగ్గర చేరి గర్జిస్తే ఎలా ఉంటదనే భయంతోనే అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. నల్లగొండను దత్తత దీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఏడాది కాలంలోనే అద్భుతంగా తీర్చి దిద్దితే ఏడాది కాలంలో కోమటిరెడ్డి సర్వనాశనం చేయటంతో పాటు రౌడీలకు అడ్డాగా మార్చాడని తెలిపారు.
గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలే నిలదీస్తున్న పరిస్థితులు కోమటిరెడ్డి గమనించాలని, ఈ నిలదీతలు నిన్ను చెప్పుతో కొట్టినట్లు అనిపిస్తలేవా అని అన్నారు. సోయి లేకుండా నీచంగా ఫ్లెక్సీల మీద రాజకీయం చేయడం కోమటిరెడ్డి దిగజారుడుకు నిదర్శమని తెలిపారు. మీరు పెంచి పోషించిన కరువును పదేండ్లల్లో పోగా నల్లగొండలో 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే వచ్చిన ఏడాదిలోనే సర్వనాశనం చేశారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, తండు సైదులు గౌడ్, మందడి సైదిరెడ్డి, కరీంపాష, బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.