సూర్యాపేట, మే 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిరంగాల్లో విఫలమై అవినీతిలో మాత్రం అత్యంత ప్రగతిని సాధించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇక రౌడీయిజం ఊహకందని విధంగా మారుతుందన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దానికి పరాకాష్ట అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం, సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు. నోటీసులిస్తే భయపడేవారెవరూ లేరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ క్రేజ్ పెరుగుతుంటే రేవంత్‌రెడ్డికి ఏడుపు మొదలైందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఇతర దేశాల ఆహ్వానం మేరకు కేటీఆర్ వెళ్తుండగా తట్టుకోలేపోతున్నారన్నారు. విదేశాలకు వెళ్లకుండా కేటీఆర్‌ను ఆపాలనే అక్కసుతోనే నోటీసులు, చిల్లర డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి సోయి లేదని, 18 నెలలైనా ఇంకా బీఆర్ఎస్ మీద ఏడుపు తగ్గలేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా అందరికీ తెలియజేసిందేనని విమర్శించారు. అన్ని శాఖల్లో కమీషన్లే వాళ్ల ఎజెండాగా మారిందని ఆరోపించారు. ఏ మంత్రి ఎంత సంపాదించాలే, సీఎం సీటుకు ఎట్లా పోటీ పడాలే అన్న సోయి తప్ప మరొకటి లేదన్నారు.
అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకునే విషయంలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. అందాల పోటీలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిండన్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ చార్జిషీట్లో రేవంత్ పేరు ఉండటంతో మోదీని కలువడానికి వెళ్లాడని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఆ పార్టీ దోస్తీ ఎట్లుందో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు కట్టిండో కాంగ్రెస్‌కు అవగాహన లేదన్నారు. మన నీళ్లను చంద్రబాబు ఎత్తుకెళ్తుంటే సోయే లేదని ధ్వజమెత్తారు. సిరిసిల్ల ఘటన కాంగ్రెస్ నాయకుల చిల్లర చేష్టలకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. చిల్లర చేష్టలు మానుకొని ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదన్నారు.