మిర్యాలగూడ, నవంబర్ 17: టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018, 2023 ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పడంతోనే కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని, తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించి అవమాన పర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన అనుచరులతో కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత సమక్షం లో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అందరం కలిసి గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనను నమ్ముకొని వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్లో తప్పక న్యాయం జరుగుతుందన్నారు.