దామరచర్ల, మార్చి 25 : విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న నాయక్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్ష్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న వసతి గృహాల విద్యార్థుల మెస్ బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ నేడు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసేందుకు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులపై పోలీసుల దౌర్జన్యం చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు న్నర సంవత్సరాలు గడిచినా విద్యారంగ సమస్యలు చెప్పుకుందామంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించలేని అసమర్ధత పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామంటూనే విద్యారంగానికి నిధులు తక్కువ కేటాయించిందని దుయ్యబట్టారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ లతో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో ఉదయం నాలుగు గంటల నుండి ఎస్ఎఫ్ఐ నాయకుల ఇండ్లకు వెళ్లి మరి అరెస్టు చేస్తున్నారంటే పాలక ప్రభుత్వం విద్యారంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి రాష్ట్ర బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాడుతుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన పోలీసులతో అక్రమ అరెస్టులు చేసినా బెదీరేది లేదన్నారు.