రామగిరి, జూలై 14 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలో మూడో కాన్వకేషన్(స్నాతకోత్సవం) ఆగస్టులో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైన దశాబ్ద కాలం తర్వాత 5 మే, 2017న తొలి కాన్వకేషన్ జరుగగా అప్పటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అదే స్ఫూర్తితో ద్వితీయ స్నాతకోత్సవం 20 అక్టోబర్, 2018లో నిర్వహించారు. అయితే 2017-18 నుంచి 2020-21 విద్యా సంవత్సరంలో పీహెచ్డీ, యూజీ, పీజీ, ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి షెడ్యూల్ విడుదల చేశారు. దాంతో యూనివర్సిటీలో పీహెచ్‌డీతోపాటు వివిధ కోర్సుల్లో ఆయా విద్యా సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన వారితోపాటు అనుబంధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా విభాగాల్లో ఒరిజినల్ డిగ్రీల పట్టాలు(కాన్వకేషన్స్) అందనున్నాయి.
కాగా ఆయా కోర్సుల్లో సబ్జెక్టుల వారీగా బంగారు పతకాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఎం జీయూ అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం చేయగా గతేడాది జనవరి 11న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన వారు తిరిగి దరఖాస్తులు చేయనవసరం లేదని వర్సిటీ అధికారులు వెల్లడించారు. పరీక్ష విభాగం అధికారులు తృతీయ కాన్వకేషన్ నిర్వహణకు కావాల్సిన అంతర్గత పనులు నిర్వహణలో నిమగ్నమయ్యారు. అత్యవసరమున్నవారికి కాన్వకేషన్తో సంబంధం లేకుం డా వర్సిటీలో నిబంధనల మేరకు విద్యార్థులకు పట్టాలను అందిస్తున్నారు. కాన్వకేషన్‌కు www.mguniversity.ac.inలో దరఖాస్తులను చేసుకోవాలి.
కాన్వకేషన్ ఉపయోగం …
కోర్సు పూర్తి చేసిన తర్వాత జారీచేసి ప్రొవిజినల్ సర్టిఫికెట్ల కాలపరిమితి రెండేండ్లు మాత్రమే ఉంటుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన సందర్భాల్లో, ఉన్నత విద్య(పీహెచ్డీ, ఎంఫీల్, ఇతర వర్సిటీలో కోర్సులు చేయడానికి వెళ్లిన సందర్భంలో) కూడా వీటిని అడుగుతారు.
తృతీయ కాన్వకేషన్‌కు నిర్వహణకు కసరత్తు
మూడో కాన్వకేషన్ నిర్వహించి విద్యార్థులకు పట్టాలను అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఆగస్టులో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది నోటిఫికేషన్ జారీచేసినప్పటికీ అనివార్య కారణాలతో నిర్వహించలేదు. అయితే 2017-18 నుంచి 2020-21 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసి టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థులతోపాటు అందరికి కాన్వకేషన్స్ అందజేస్తాం. విద్యార్థులు వర్సిటీలో అందుకు సంబంధించిన వివరాలతో దరఖాస్తులు చేస్తే కాన్వకేషన్ జారీచేస్తున్నాం.
– సీహెచ్.గోపాల్‌రెడ్డి, వీసీ ,ఎంజీయూ