నేరేడుచర్ల, జూలై 16: భూమి లేకున్నా.. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందడం లేదు. యేటా కౌలు, పెట్టుబడి పెరిగిపోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదని, అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో మొత్తం రైతులు 3.10 లక్షల మంది ఉండగా సుమారు 50 నుంచి 60 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. భూ యజమానులు ఒక్క పంటకు ఎకరానికి రూ. 10 నుంచి రూ. 25 వేలు తీసుకుంటూ కౌలుకు ఇస్తున్నారు. పలు కారణాల వల్ల కౌలు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బ్యాంకులు కూడా కనికరించడం లేదు. రైతు భరోసా, పంట రుణాలు, బీమా, ప్రకృతి విపత్తల పరిహార వంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఎవరికీ అందడం లేదు. భూ యజమానులతో సమానంగా కౌలుదారులు.. సాగు హక్కు పత్రాలు పొందలేకపోతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విషయంలో కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్టుబడుల కోసం అధిక వడ్డీపై ప్రైవేట్ రుణాలు తీసుకుంటున్నామని వాపోతున్నారు.
గుర్తింపు కార్డులివ్వాలి..
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి సంవత్సరం కౌలు ధరలు పెరుగుతున్నా, ఆశించిన పంటలు పండటం లేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధర వస్తలేదు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలే కాలం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు సైతం సబ్సిడీపై ఇచ్చేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు.