పోయినసారి 63లక్షల సీడే..!
కాంగ్రెస్ పాలనలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భారీగా కోత విధించారు. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. 2023 వరకు ఏటా 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలేవారు. అందులో 2 కోట్లు పెద్ద పిల్లలు, కోటి చిన్న పిల్లలు ఉన్నాయి. కానీ గతేడాది మాత్రం 1.5 కోట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ కుదించిన వాటిని సైతం సక్రమంగా అమలు చేయలేదు. నిధులు కొరతతో చివరకు కేవలం 63లక్షల సీడ్ మాత్రమే చెరువుల్లో వదిలి చేతులు దులుపుకొన్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పథకాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొనసాగింపుపైనా ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. సీజన్ ప్రారంభమవుతున్నా టెండర్ ప్రక్రియ ఊసేలేదు. సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోసింది. ఏ వర్గాన్ని తక్కువ చేయకుండా అన్ని విధాలుగా ఆదుకున్నది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వంద శాతం ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. మత్స్య సొసైటీలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చెరువుల్లో చేప విత్తనాలను వదిలారు. 2016లో ప్రారంభమైన ఈ పథకం 2023 వరకు నిర్విరామంగా కొనసాగింది. ఎనిమిది విడతలుగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని సుమారు 790 చెరువుల్లో ఏటా 3 కోట్ల సీడ్‌ను వదిలారు. రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం, 80 నుంచి 100 ఎంఎం వరకు ఉన్న సీడ్‌ను వదిలేవారు. దీంతో ఏటా చేపల ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది.
పత్తాలేని టెండర్ల ప్రక్రియ..
గతంలో ప్రతి సంవత్సరం వానాకాలం ప్రారంభం కాకముందే చేప పిల్లల పంపిణీ కోసం ఏర్పాట్లు జరిగేవి. జూన్ ప్రారంభంలోనే టెండర్లను ఆహ్వానించి ఫైనల్ చేసేవారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే చెరువుల్లోకి సీడ్‌ను వదిలేవారు. అయితే ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఈ పథకంపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పటి వరకు ఇంకా టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదు. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. చేపల పంపిణీ ఉంటుందా.. లేదా..? అనే క్లారిటీ కూడా లేదు. కొన్ని చోట్ల చేపల పంపిణీకి బదులుగా నగదు అందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. కాగా సెప్టెంబర్ వరకు సీడ్ వేస్తేనే మంచి ఎదుగుదల వస్తుందని, ఆలస్యమైతే చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధికి గండి.?
ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకం కింద ఎంతో మందికి ఉపాధి లభించింది. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగారు. జిల్లాలో142 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా 9 వేల మంది మత్య్సకారులు ఉపాధి పొందుతున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేని వారు, పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు కంటే ముందు మత్స్యకారులకు సంబంధించి దళారీ వ్యవస్థ అమలులో ఉండేది. ఇప్పుడు ఉచిత చేప పిల్లల పంపిణీ ఆగిపోతే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.