గుండాల : గుండాల రైతులకు దేవాదుల ( Devadula ) ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ( Gongidi Sunitha ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవాబ్ పేట రిజర్వాయర్( Reservior) నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీరును విడుదల చేసి చెరువులు నింపాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో ( Ramakrishna reddy) కలిసి ఆమె బురుజుబావి నుంచి వెల్మజాల వరకు దేవాదుల కాలువల వెంట సోమవారం పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా ఎండిన వరి పొలాలను పరిశీలించారు. పలువురు రైతులు కలిసి తమ పొలాలు ఎండిపోయాయని బోరున విలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు లేక పంటలు ఎండి రైతులు నానా తిప్పలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government) చోద్యం చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను పట్టించుకునే పాపాన పోవడం లేదని, సాగునీరు విడుదల చేయాలన్న సోయి లేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.
రైతులకు సాగు సాగునీరు ఇవ్వాలని వేడుకుంటున్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా తయారయిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తినే ప్రతి ఆహారపు మెతుకు మీద రైతుల చెమట చుక్క ఉందని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గుండాల మండలానికి 7సార్లు సాగునీరు విడుదల చేసి చెరువులు నింపిందని గుర్తు చేశారు.
తక్షణమే దేవాదుల దగ్గర ఉన్న 33 మోటార్లు ఆన్ చేసి నవాబ్ పేట రిజర్వాయర్ నింపాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కళ్లు తెరచి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం పచ్చబడిందని, నేడు కాంగ్రెస్ హయాంలో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుదేలయిందన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరువు అన్నారు. పంట పొలాలు ఎండిన రైతులకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వెల్మజాల కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.