సూర్యాపేట, జనవరి 16(నమస్తే తెలంగాణ) : సాగు నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అన్ని వనరులున్నా నీటి విడుదల చేయడంలో అలసత్వం, అసమర్థ ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వంపై బదనాం చేయడంలో భాగంగా కుట్రలు చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తున్నది. గత యాసంగిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సాకు చూపి సాగునీటిని విడుదల చేయకపోవడంలో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయిన విషయం తెలిసిందే. ఈ యాసంగిలోనూ అరకొర నీటి విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నది. ఆన్ అండ్ పద్ధతిలో నీటి విడుదల చేయడంతో అవి ముందున్న మండలాలకు నీళ్లు చేరి చివరి మండలాలకు రాని పరిస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరాయంగా నీటి విడుదల చేయడంతో రెండు సీజన్లలో పంటలు పుష్కలంగా పండాయి. అదే మాదిరిగా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కుట్ర పూరితంగా వ్యహరిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది.గత వానకాలంలో కురిసిన వర్షాలతో బావులు, బోర్లలో నీళ్లు ఉండడంతో ఎస్పారెస్పీ ఆయకట్టు కింద ప్రస్తుతానికి నాట్లు వేసినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు అందకపోవచ్చని ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా తెలుస్తున్నది. గతంలో కాళేశ్వరం పంపుల నుంచి వచ్చే నీళ్లు సప్పోర్ట్ ఇవ్వడంతోనే పంట చేతికి వచ్చే వరకు నీటిని ఇవ్వగలిగామని, ప్రస్తుతం నీటి నిల్వలు తక్కువ ఉన్నందున పూర్తి స్థాయిలో ఇవ్వడం కష్టమని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ఈ యాసంగిలో జిల్లాలో 50శాతం ఎస్సారెస్పీ ఆయకట్టు ఎండడం ఖాయంగా కనిపిస్తుంది.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలతోపాటు రైతన్న బలపడ్డాడు. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని భూముల్లోకి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు పారించి సస్యశ్యామలం చేశారు. ఏడాదికి రెండు సీజన్లకు నిరంతరాయంగా నీళ్లు అందించి పంటలు పుష్కలంగా పండేలా చేశారు. యాసంగిలో మూడు నెలలు అంటే దాదాపు 85 నుంచి వంద రోజుల పాటు 30 నుంచి 40 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేశారు. దాంతో ఒక్క సూర్యాపేట జిల్లాలోని 2.95లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి యాసంగికి గోదావరి జలాలు రాకపోవడంతో వరి పంటలు ఎండి పోయిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు పదేండ్ల తరువాత ప్రభుత్వంపై రైతుల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు పునరావృతమయ్యాయి. కాగా కాంగ్రెస్ పాలనలో రెండో సారి వస్తున్న ప్రస్తుత యాసంగికి కూడా గోదావరి జలాల విడుదలపై అయోమయం కనిపిస్తున్నది.
ఈ యాసంగిలో దుక్కులు దున్ని నాట్లు వేస్తున్న రైతాంగం తొలి దశలోనే నీళ్ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టే దుస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ కాల్వల నుంచి ఇటీవల వారం రోజుల పాటు నీటిని విడుదల చేయగా సగం పొలాలకు కూడా చేరుకోలేదు. అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం మండలాలతోపాటు చివ్వెంల, నడిగూడెం, మునగాల, పెన్‌పహాడ్ మండలాల్లోని చాలా వరకు కాల్వల్లో నీళ్లు పారడం లేదు. బావులు, బోర్ల కింద ఇప్పటికే వేసి నాట్లు ఎండిపోతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కాల్వల్లో నీళ్లు రావడం లేదని, వేసిన నాట్లు ఎండిపోతున్నాయని ఇప్పటికే రైతులు ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
చిన్న సాకును చూపి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడంతో గత యాసంగిలో జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయిన విషయం విదితమే. ఇటీవల వానకాలంలో వర్షాలు కురవడంతో పంటలకు ఏ ఢోకా లేకుండా పోయింది. కానీ ఈ యాసంగిలో గత యాసంగి మాదిరిగా పరిస్థితులు పునరావృతమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. నీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండని పక్షంలో పంటలకు భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉన్నది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద నేరుగా నీరు పారేవి 2.50 లక్షల ఎకరాలు, ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటల కింద మరో 45వేలు ఎకరాలు మొత్తం 2.95 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. యాసంగిలో పంటలు పూర్తి స్థాయిలో చేతికి అందాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు నీటిని సరఫరా చేయాలని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు, పంటల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయకూడదు. ఏదో లబ్ధి పొందాలని నీటి నిర్వహణను గాలికి వదిలేసినా, చిన్న సాకు చూపించి కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేయండా పంటలను ఎండబెట్టినా రైతులే ప్రభుత్వ పెద్దలను నిలదీస్తరు.. ఉరికించి తరిమికొడ్తరు జాగ్రత్త. బీఆర్ఎస్ హయాంలో దాదాపు ఆరేండ్ల పాటు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీటిని ఇచ్చి పంటలను కాపాడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంటలను ఎండబెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాలు వెచ్చించి ప్రాజెక్టును నిర్మిస్తే చిన్న బ్యారేజీ మరమ్మతుల పని చేయించలేని దద్దమ్మలాగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాలు మాని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి రైతులను అదుకోవాలి తప్ప రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారం మానుకోవాలి. రైతులకు నష్టం చేకూరితే వారి వెంట బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుంది.
– గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, తుంగతుర్తి