కట్టంగూర్, ఏప్రిల్ 24 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, వందనపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గజ్జి రవి అన్నారు. గురువారం ఈదులూరు, పందనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడా రావడంతో క్వింటాకు రెండున్నర కేజీలు నష్టపోతున్నాయని రైతులు తెలుపడంతో అక్కడే వారితో కలిసి ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే దళారుల చేతిలో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న మహిళా సంఘాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులు, రైతు కూలీ సంఘం నాయకులతో చర్చించారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లర్లతో మాట్లాడి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తానని తాసీల్దార్ హామీ ఇవ్వండతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాధవరెడ్డి, తిరుమలేశ్, దాసరి రాములు, గజ్జి నాగరాజు, సింహాద్రి, చింతల శంకర్, సత్తయ్య పాల్గొన్నారు.