తుంగతుర్తి, మే 21 : ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి గ్రామాలలోని ఐకెపి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం కలుగుతుందని, ఐకెపి కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కూడా వడ్లుకొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కాంట అయితే లారీలు రావు, లారీలు వచ్చి లోడు వేస్తే మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదన్నారు.
మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యంలో కోత విధించి రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తునికి సాయిలు, సర్పంచ్ మనోజ్, ఎల్లయ్య, మాజీ సర్పంచ్ యాకూ నాయక్, నాగయ్య, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, సురేష్, భాస్కర్, వెంకన్న, భిక్షం, వీరస్వామి, నర్సయ్య, రాము, యాదయ్య, అంబేద్కర్, పరశురాములు, సత్తయ్య, నవీన్, లింగయ్య, కాలేంచెర్ల వెంకన్న పాల్గొన్నారు.