హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : దేశ ఆర్థికవ్యవస్థలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కీలకమని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు-2026పై సోమవారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లు ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు రవిచంద్ర తెలిపారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ సింగిల్ విండో విధానం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానం దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిందని ఎంపీ రవిచంద్ర కొనియాడారు. ఈ విధానంతో పరిశ్రమల స్థాపన ప్రక్రియ అత్యంత సులభతరం అయిందని, ఫలితంగా రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగానికి బ్యాంకుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణాలు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని సూచించారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలి
యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగ యువతను, విద్యార్థులను మోసం చేశాయని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ సరార్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో ఖమ్మం జిల్లా న్యూలక్మీపురానికి చెందిన వేణుకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం విచారకరమని పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వేణుకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పకా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.