భువనగిరి అర్బన్, డిసెంబర్ 26 : భువనగిరి పట్టణ పరిధి రైల్వే స్టేషన్ సమీపంలో గల మిల్క్ చిల్లింగ్ సెంటర్లో కొన్ని రోజుల నుంచి అక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. మిల్క్ సెంటర్ మేనేజర్ ఆవు పాలకు బదులుగా బర్రె పాలకు బిల్లు పెట్టి నెలకు రూ.2లక్షలు స్వాహా చేస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయం, రాత్రి వచ్చిన పాలకు వేర్వేరుగా వచ్చిన వెన్నశాతం ప్రకారం ధర నిర్ణయించి పాడి రైతులకు చెల్లింపులు చేస్తారు. ఈ క్రమంలో గ్రామాల్లో సేకరించిన ఆవుపాలకు బదులుగా బర్రె పాలుగా చూపించారు. పట్టణంలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్లో అక్రమాలకు పాల్పడిన మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిపై సస్సెన్షన్ వేటు వేశారు.
భువనగిరిలోని మదర్ డెయిరీలో నిబంధనల ప్రకారం ఉదయం పాలకు, రాత్రి పాలకు వేర్వేరుగా వెన్న తీసి దానికి వేర్వేరుగా వెన్న శాతాన్ని లెక్కిస్తారు. అందులో నుంచి వచ్చిన వెన్నశాతం ప్రకారమే పాల ధర నిర్ణయించి ఉదయం పూట వచ్చే ఆవు పాలకు రూ.38, రాత్రి వచ్చే పాలకు రూ.36 పాడి రైతులకు చెల్లిస్తారు. బర్రె పాలకు ఉదయం రూ.57, రాత్రి పాలకు రూ.52 చొప్పున చెల్లిస్తారు. ఈ క్రమంలో ఎంబావి గ్రామంలోని పాల సెంటర్ నుంచి వచ్చిన 200 లీటర్ల ఆవుపాలకు వచ్చే వెన్న శాతానికి బదులుగా బర్రె పాల వెన్న శాతాన్ని లెక్కించి సెంటర్లో చెల్లించారు. అంటే ఉదయం 200 లీటర్లు, రాత్రి 200 లీటర్ల చొప్పున తీసుకుంటే ప్రతి రోజూ 400 లీటర్లను ఆవుపాలకు బదులుగా బర్రెపాలుగా మార్చారు.
ఆవు పాలకు ఉదయం 200 లీటర్లకు ఒక లీటర్‌కు రూ.38 ప్రకారం నెలకు 6వేల లీటర్లకు నెలకు రూ.2,28,000, రాత్రిపూట 200 లీటర్లకు ఒక లీటర్‌కు రూ.36 చొప్పున నెలకు 6వేల లీటర్లకు రూ.2,16,000 చెల్లించాలి. కానీ చిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు ఆవుపాలకు బదులుగా బర్రెపాలకు ఇచ్చే ధరను లెక్కించారు. అంటే రోజు ఉదయం పూటకు 200 చొప్పున నెలకు 6వేల లీటర్లకు ఒక లీటర్‌కు రూ.57 చొప్పున రూ.3,42,000, రాత్రి పాలు 6వేల లీటర్లకు ఒక లీటర్‌కు రూ. 52 చొప్పున రూ.3,12,000 కానున్నాయి. అయితే ఉదయం పూట 6వేల లీటర్ల పాలకు రూ.1,14,000, రాత్రి పూట పాలకు రూ.96వేలను మేనేజర్ కాజేశాడు.
ఈ తతంగం అంతా సుమారు నాలుగు నెలలకు పైగా సాగిస్తున్నట్లు తెలుస్తుంది. మదర్ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్లో అవినీతి జరుగడానికి ముఖ్య కారణం ఇదే. ఆవుపాలకు బదులుగా బర్రెపాలు చూపించిన పాల సెంటర్ చైర్‌పర్సన్‌గా భార్య, చిల్లింగ్ సెంటర్లో ఫీల్డ్ సూపర్వైజర్గా భర్త పని చేయడంతో ఆవుపాలకు బదులుగా బర్రెపాలు చూపించడం సులువుగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
భువనగిరి మదర్ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్‌కు సమీపంలోని గ్రామాల పాడి రైతులు పాలను తీసుకొస్తారు. పాల సేకరణలో భాగంగా మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధి ఎంబావి పాల సెంటర్ నుంచి ఉదయం 200 లీటర్లు, రాత్రి 200 లీటర్ల ఆవు పాలను తీసుకొచ్చే వారు. కానీ ఆవు పాలలో వచ్చే వెన్న శాతానికి బదులు బర్రె పాలకు వచ్చే వెన్న శాతంగా లెక్కలు రాసి గుట్టుచప్పుడు కాకుండా మేనేజర్ ప్రతి నెలా అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నాడు. ఈ క్రమంలో నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా మధుసూదన్‌రెడ్డి ఈ నెల 20వ తేది రాత్రి భువనగిరి చిల్లింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ విషయంపై విచారణ చేపట్టగా అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఆరుగురిపై ఈ నెల 24న సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు.
ఆవుపాలకు బదులు బర్రెపాల వెన్నశాతాన్ని పెట్టి నెలకు రూ.2లక్షలు కాజేసి తలా పిడికెడు పంచుకున్న పాపంలో మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్‌తోపాటు మరో ఐదుగురు సిబ్బందిని మదర్ డెయిరీ చైర్మన్ సస్పెండ్ చేశారు. ఈ అక్రమాల్లో భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్, ప్రాసెసింగ్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు ఫీల్డ్ సూపర్వైజర్లు, ఒక ఆపరేటర్‌తో మొత్తం ఆరుగురిని సస్పెండ్ చేశారు. ఇందులో వచ్చిన డబ్బులో 60శాతం మేనేజర్‌కు, 40 శాతం డబ్బును మిగతా సిబ్బందికి చేరినట్లు సమాచారం.