మిర్యాలగూడ, ఆగస్టు 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్న పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భూక్యా హనుమానాయక్, సింగాల కాటంరాజు, నర్సారావుపేట జిల్లా కారంపూడికి చెందిన మద్దూరి చంటి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటుపడి గ్రూపు గా ఏర్పడ్డారు. జల్సాల కోసం ఒడిషా రాష్ర్టానికి చెందిన ఆనంద్‌గురు వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. గంజాయికి బానిసలైన మిర్యాలగూడకు చెందిన కొందరు వీరికి పరిచయమయ్యారు.
ఒడి షా రాష్ట్రం నుంచి తెచ్చిన గంజాయిని మిర్యాలగూడ యువకులకు అందజేసేందుకు శుక్రవారం హనుమానాయక్, కాటంరాజు, చంటి రెండు గ్రూపులుగా విడిపోయారు. మద్దూరి చంటి తన బైక్ మీద 5 కిలోల గంజాయిని, హనుమానాయక్, కాటంరాజు కారులో 17 కిలోల గంజాయితో మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువకులకు అందజేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మద్దూరి చంటి, షేక్ రియాజ్, మహమ్మద్ హర్షద్ అయూ బ్, మహమ్మద్ సలీం అక్తర్, మహమ్మద్ జునైద్ అలీ, షేక్ అఫ్రోజ్, కుర్ర సందీప్, భూక్యా హనుమానాయక్, సింగాల కాటంరాజులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన ఆనంద్‌గురు పరారీ లో ఉన్నాడు. వీరి నుంచి 22 కిలోల గంజాయి, ఒక కారు, మూడు బైక్‌లు, పది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో రిమాండ్ చేశారు. సమావేశంలో టూటౌన్ సీఐ సోమనర్సయ్య, ఎస్ఐలు లక్ష్మయ్య, రాంబాబు, సిబ్బం ది తదితరులు ఉన్నారు.