నీలగిరి, జూన్22: యోగా (Yoga) ద్వారా ఒత్తిడిని అధిగమించడంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగు పరుచుకోవచ్చని జైలు సూపరింటెండెంట్ గౌర ప్రమోద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర కారాగారంలో ఆదివారం ఉదయం విశేష యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా ద్వారా ఒత్తిడి నిర్వహణ, ఆత్మపరిశీలన, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో ఆత్మశుద్ధి, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య అభివృద్ధి పట్ల అవగాహన పెరిగిందన్నారు.
ఇది సంస్కారాత్మక మార్పు దిశగా ఒక మైలురాయి అయ్యిందని పేర్కొన్నారు. ఖైదీల పునరావాసానికి ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గత పది రోజులుగా ప్రముఖ యోగా గురువు కరుణాకర్ సారథ్యంలో ఖైదీలకు, సిబ్బందికి యోగాసనాలు, ధ్యానం, యోగా సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ముగింపు చిహ్నంగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఖైదీలు, జైలు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని యోగ యొక్క ఆవశ్యకతను ప్రాధాన్యంగా తీసుకొని ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జైలర్ బాలకృష్ణ, అధికారులు వెంకట్ రెడ్డి, చింత వెంకటేశ్వర్లు, శ్రీ రామ్, ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా పాల్గొన్నారు.