Farmhouse | మిర్యాలగూడ : పట్టణాల్లో కనిపించే ఫామ్‌హౌస్ కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాలు, పట్టణాల్లో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. వీకెండ్స్, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇందుకోసం పట్టణాల సమీప గ్రామాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటున్నారు. పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకొని కుటుంబ సమేతంగా సేద తీరుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఫామ్‌హౌజ్‌ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న చౌటుప్పల్ మండలంలో స్థోమతను బట్టి 10 గుంటల నుంచి 10ఎకరాల వరకు కొనుగోలు చేసి అనుకున్నట్లుగా నిర్మాణాలు చేసుకుంటున్నారు.
కాంక్రిట్ జంగిల్‌గా మారిన పట్టణాలు, నగరాల్లో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. వీకెండ్స్, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకోసం పట్టణాల సమీప ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నచ్చిన విధంగా ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటున్నారు. పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకుని కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి సేద తీరుతున్నారు.
ఫామ్‌హౌస్ కల్చర్ ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు కొంత ఆర్థికంగా స్థిరపడ్డ ప్రతి ఒక్కరూ వాటిపై ఆసక్తి చూపుతున్నారు. పట్టణాల్లో పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, కొవిడ్ మహమ్మారి లాంటి వైరస్ల బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతో మధ్య తరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు సైతం వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటున్నారు. సెలవు దినాలు, పండుగ రోజుల్లో ఫామ్‌హౌస్‌లలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. జిల్లాలో వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలు గణనీయంగా పెరుగడమే ఇందుకు నిదర్శనం. వ్యవసాయ క్షేత్రాల్లో కొంత స్థలాన్ని ఫామ్‌హౌస్‌ల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి నేర్పిన గుణపాఠంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఉదయం, సాయంత్రం ఫామ్‌హౌస్‌ల్లో యోగా, వాకింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే పనిలో పడ్డారు. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లకు డబ్బులు కుమ్మరించి విందులు చేసుకునే అవసరం లేకుండా చిన్న చిన్న ఫంక్షన్లను ప్రకృతి ఒడిలో చేసుకుంటున్నారు.
రోజురోజుకూ విస్తరిస్తున్న ఫామ్‌హౌస్ కల్చర్
చౌటుప్పల్ : మండల వ్యాప్తంగా ఫామ్‌హౌస్ కల్చర్ విస్తరిస్తున్నది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, వీటికి తోడు 65వ నంబర్ జాతీయ రహదారి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం, నీటి సౌకర్యం తదితరాలు ఫౌమ్‌హౌస్ కల్చర్ పెరిగేందుకు దోహదపడుతున్నాయి. 10 గుంటల భూమి నుంచి 10 ఎకరాలకు పైగా స్థలాలు కొనుగోలు చేసి వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. విశాలమైన ఇంటి నిర్మాణం, చుట్టూ ప్రహరీ, ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలు పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద ఇంటి నిర్మాణ అనుమతులకు నిబంధనలు సడలించడం ఈ కల్చర్ పెరిగేందుకు దోహదపడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ రాచకొండ పర్యాటకం ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర్లో ఉండటంతో రోజురోజుకూ ఫౌమ్‌హౌస్ కల్చర్ పెరుగుతున్నది.
మానసిక ప్రశాంతత ఉంటుంది
నాకు వేములపల్లి మండలం మంగాపురం శివారులో 10 ఎకరాల తోట ఉంది. కరోనా కంటే ముందుగానే తోటలో ఫామ్‌హౌస్ నిర్మించాం. వ్యాపార పనులతో సిటీలో కాలుష్యం మధ్య తిరగాల్సి వస్తుంది. నెలలో నాలుగు, ఐదు రోజులపాటు ఫామ్‌హౌస్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుని కుటుంబంతో వస్తాం. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులందరం కలిసి ఉల్లాసంగా గడిపి వెళ్తుంటాం. కరోనా సమయంలో రెండు నెలల పాటు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నాం. ఇక్కడ చెట్ల మధ్య వాతావరణం చాలా బాగుంటుంది.