నకిరేకల్, జూన్ 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం జరిగింది. మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబురాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సంబురాలకు హాజరైన అంబటి భిక్షమయ్య అనే రైతు తన ఖాతాలో పడిన రైతు భరోసా డబ్బులు బ్యాంక్ వాళ్లు జప్తు చేసుకున్నారని తన ఆవేదన తెలిపేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తుండగా రైతును కలెక్టర్ సెక్యూరిటీ సిబ్బంది, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు రైతు వేదిక నుంచి బయటకు లాక్కెళ్లారు. ఇదంతా ఉన్నతాధికారుల కండ్ల ముందరే జరుగుతున్నా జిల్లా అధికారులు స్పందించలేదు. తర్వాత హడావిడిగా అధికారులు రైతు వివరాలు కనుక్కొని బ్యాంక్‌కు ఫోన్ చేసి రేపు డబ్బులు తెచ్చుకోమని అక్కడి నుండి పంపించేశారు.
ఇదిలా ఉండగా సీఎం ప్రసంగం ప్రారంభంలో రైతు వేదికలో మైకు మొరాయించింది. దీంతో వెనుక కూర్చున్న రైతులకు సీఎం ప్రసంగం వినబడక ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. బయటకు వెళ్లిన రైతులను పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది బతిమిలాడి తీసుకొచ్చి కూర్చొబెట్టే పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రసంగంలో కూర్చున్నా, జిల్లా స్థాయి అధికారులు ఉన్నా రైతులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సంబురాల కార్యక్రమానికి 30 మంది రైతులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.
బాధిత రైతు భిక్షమయ్య స్పందిస్తూ.. తనకు 3 ఎకరాల 20 గుంటల వ్యవసాయ పొలం ఉందని తెలిపారు. నకిరేకల్ ఎస్బిఐ బ్యాంక్‌లో రూ.1,73,300 రుణం తీసుకున్నట్లు చెప్పాడు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తమని చెప్పిండు. ఇంతవరకూ రుణమాఫీ కాలే. మొన్నే రూ.20,050 రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడ్డయ్. వాటిని బ్యాంక్ వాళ్లు అప్పుకు జప్తు చేసుకున్నరు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ నుండి ఇప్పియ్యాలని కలెక్టర్‌ను అడుగుదామని లేచి ఆమె దగ్గరకు వెళ్లి మేడం..మేడం అని పిలిచినా. అంతలోపే ఎవరెవరో సార్లు వచ్చి నన్ను లాక్కొని బయటకు తీసుకు పోయినట్లు తెలిపాడు. పొలం దున్నిద్దామన్నా, విత్తనపు వడ్లు తెచ్చుకుందామన్నా పైసలు లేవు. మూడోకారులో పడ్డ పైసలు కూడా బ్యాంక్ వాళ్లు లాగేసుకున్నరని ఆవేదన వ్యక్తం చేశాడు.
Nakrekal : రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం
Nakrekal : రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం