మిర్యాలగూడ, ఏప్రిల్ 10 : మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహా తేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో వే బ్రిడ్జిని తనిఖీ చేసి రైతుల ధాన్యం కొలతలను పరిశీలించారు. వే బ్రిడ్జిలో పది టన్నుల ధాన్యంకు 40 కిలోలు తేడా వస్తుండడంతో గుర్తించి వే బ్రిడ్జీని సీజ్ చేశారు. రూ.1.25 లక్షలు జరిమానా విధించి వే బ్రిడ్జి యాజమాన్యం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రైతుల ఫిర్యాదుతో మహా తేజ రైస్ మిల్లు వే బ్రిడ్జిని తనిఖీ చేసి తూకం తేడా ఉండడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైస్ మిల్లుల నిర్వాహకులు తూకంలో తేడాలను సరి చేసుకోవాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.