మోతె, మార్చి 13 : డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోతె మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో నెలకొన్న మౌలిక సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కానీ డబుల్ బెడ్రూం ఇండ్లలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ దీపాలు వంటి కనీస సౌకర్యాలు నేటికీ కల్పించలేదన్నారు. దీని మూలంగా ఇక్కడ నివసించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
కరెంటు సౌకర్యం లేకపోవడంతో పాము, తేలు కాటుకు గురవుతున్నట్లు చెప్పారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ లేకపోవడంతో వర్షాలు వస్తే నీళ్లు ఇండ్లలోనే ప్రవహిస్తున్నట్లు తెలిపారు. కావునా ప్రభుత్వం తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూం ఇండ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు చల్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీనివాస్, జంపల స్వరాజ్యం, గురిజాల ఎంకన్న, సురకంటి రామ్ రెడ్డి, ఎడమ పద్మ, గురజాల జానమ్మ, అమృతం పాల్గొన్నారు.