నందికొండ, జులై 3: కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, సుంకేశుల ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుతుండటంతో ఎగువన పడే వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీరు చివరన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతోంది.
జూరాల క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుండటం తో శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గానూ 875.60 (166.31 టీఎంసీల) అడుగులకు చేరింది. శ్రీశైలంలో పూర్తి స్థాయి చేరుకోవడానికి ఇంకా 10 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలం జలవిద్యు త్తు కేంద్రం ద్వారా 50,771 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గానూ 520.10 అడుగుల వద్ద 149.4580 టీఎంసీ నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం రోజుకు రెండడుగుల మేర పెరుగుతోంది. నాగార్జునసాగర్ డ్యాం ఎడమ, కుడికాల్వలు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. గతేడాది కంటే ఈ ఏడాది నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వరద నీరు ముందుగానే వచ్చి చేరుతుండటంతో ముందస్తుగానే నీటిని విడుదల చేస్తారని సాగర్ ఆయకట్టు కింది రైతులు ఆశిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.