నల్లగొండ జిల్లాలో పరీక్ష కేంద్రాలు – 47
ఫస్టియర్ – 14915
సెకండియర్ – 15761
మొత్తం విద్యార్థులు – 30676
రామగిరి, మార్చి 14: నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ప్లయి ంగ్ స్కాడ్స్, ఇన్విజిలెటర్లను నియమించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుండగా గంట ముందు నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియేట్ జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గంట ముందుగానే అనుమతి
పరీక్ష సమయానికి గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్స్ను నియమించారు. పేపర్ కస్టోడియన్లు, ప్లయింగ్ స్క్వాడ్ బృందాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాలు
పరీక్షలకు నిర్వహణకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 60,915 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో 29,563 మంది, ద్వితీయ సంవత్సరం 31,352 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా డివిజన్ కేంద్రాల్లో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో 16,930 మంది విద్యార్థులు హాజరుకానుండగా ప్రథమ సంవత్సరంలో 6,727 మంది విద్యార్థ్ధులు, ద్వితీయ సంవత్సరంలో 7,089 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో ప్రథమ 1,715 మంది, ద్వితీయ సంవత్సరంలో 1399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ప్రత్యేక యాప్‌తో పరీక్ష కేంద్రాల గుర్తింపు
పరీక్షలకు హజరవుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెంటర్ లోకేషన్ యాప్‌ను రూపొందించింది. యాప్‌తో విద్యార్థులు పరీక్ష రాసే కేంద్రాలను వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంది .
సర్వం సిద్ధం చేశాం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అంతా సిద్ధం చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే దిశగా ప్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు జిల్లా పరీక్ష విభాగం అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. నిర్ణీత సమయం కంటే నిమిష ఆలస్యమైన అనుమతి ఉండదు. కాబట్టి విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వేసవి దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నాం. అని ్న పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరుతోపాటు వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. అదే విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. – దస్రూనాయక్, డీఐఈఓ, నల్లగొండ