చందంపేట, జూన్ 17: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మౌనిక ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సిమెంట్, ఇటుక ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగ్గా.. ఇంటి నిర్మాణం మొదలు పెట్టాక రూ.లక్ష అకౌంట్లో జమ అయ్యిందని తెలిపింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. లెంటల్ లెవల్ నిర్మాణం రాగానే రెండో విడత బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు. అనంతరం చిత్రియాలలో ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
చిత్రియాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల గురించి ఆరా తీశారు. చందంపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మాతా, శిశు మరణాలు, మహిళల్లో రక్త హీనత తదితర అంశాలపై తెలుసుకున్నారు. విద్యార్థులకు యూ నిఫాం పంపిణీ చేశారా, వసతులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చాక్లెట్లు అందజేసి మంచిగ చదువుకోవాలని సూచించా రు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి జాకోబ్, తహసీల్దార్ శ్రీధర్‌బాబు, ఎంపీడీవో లక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీవో కృష్ణవేణి, చత్రునాయక్, ఎంఈవో చందర్‌నాయక్, మాజీ సర్పంచ్ రంగయ్య, వైద్యాధికారి చందులాల్ తదితరులున్నారు.