కట్టంగూర్, జూలై 19 : కట్టంగూర్ మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ బుధవారం నాటికి 50 శాతం పూర్తి కావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రౌండింగ్ కానీ గ్రామాల్లో వెంటనే ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండింగ్ పురోగతి లేనట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆది, సోమవారాలు కూడా పంచాయతీ కార్యదర్శులు పని చేస్తూ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
వన మహోత్సవం కింద మండలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం గుంతల తవ్వకం, మొక్కలు నాటడం సకాలంలో పూర్తి చేయాలని ఏపీఓకు సూచించారు. మండలంలో ఉన్న ఆసైన్డ్ భూములన్నీ ఎప్పటికప్పుడు సమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డిప్యూటీ తాసీల్దార్ అల్బట్ ప్రాంక్లిన్, ఏపీఓ కడెం రాంమోహన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు జయసుధ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.