నల్లగొండ, జూన్ 30: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందటం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు కాల్ చేసి చెబుదామంటే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదని, ఆఫీసుకు వస్తే కలవకుండా వెళ్లిపోయారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవా రం నియోజక వర్గ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నవించేందుకు రాగా ఆమె కలెక్టరేట్లో అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు.
దీంతో ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు సమస్యలను వివరించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు సంబంధించిన వివరాలు బయట పెట్టడం లేదని..దీనిపై అధికారులు కూడా సమాధానం ఇవ్వడం లేదన్నారు. సాగర్ నియోజక వర్గంలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందటం లేదని…ప్రధానంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొద్దామంటే రెస్పాండ్ కావటం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలమైన మాకే రెస్పాండ్ కాకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మం డల స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు కాంగ్రెస్ నాయకులు చెప్పింది వింటున్నారే తప్ప అర్హులెవరు..అనర్హులెవరు అని గుర్తించే పరిస్థితిలో లేరన్నారు. అధికారులు నీతీనిజాయితీగా పనిచేస్తేనే అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. పథకాలు అమలుచేసే సమయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను గుర్తించాలని, తిరుమలగిరి, సాగర్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి, డీలర్లకు మొదటి జాబితాలోనే ఇండ్లు మంజూరు చేస్తున్నారే కానీ నిరుపేదలకు మాత్రం ఇవ్వడంలేదన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు.