మోత్కూరు, నవంబర్ 24: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతలు, వ్యాపారులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని మూసీ, బిక్కేరు వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణ జరగుతోంది. అక్రమ రవాణ చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుంటున్న ఆయా శాఖల అధికారులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు, తిరుమలగిరి, శాలిగౌరారంతోపాటు ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), గుండాల, మోటకొండూరు, ఆలేరు, భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలపరిధిలోని అమ్మనబోల్ ప్రాంతంలో ఈ ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. వాస్తవంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు మాత్రం ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక లేక ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడి లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుకను సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ ఉంది. ఆయా మండలాల్లో లబ్ధిదారులతోపాటు ప్రభుత్వ పనుల నిమిత్తమై కాంట్రాక్టర్లు తాసీల్దార్ల ద్వారా అనుమతులు పొందుతున్నారు.
లబ్ధిదారుల పేరిట అక్రమ రవాణా..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. దీనిని కొందరు అవకాశంగా చేసుకొని స్థానికంగా ఉండే చోటా ఋమోటా నాయకులు, ట్రాక్టర్ల యజమానులు లబ్ధిదారుల పేరిట అనుమతులు ఉన్నా.. లేకున్నా.. దర్జాగా రవాణా చేస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుడికి ప్రభుత్వపరంగా 10 నుంచి 12 ఇసుక ట్రాక్టర్ల ఇసుకను తీసుకెళ్లడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే లబ్ధిదారుడు ట్రాక్టర్ ఇసుక కోసం స్థానిక నాయకులు, ట్రాక్టర్ యజమానులను సంప్రదించి ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి తీసుకుంటున్నారు.
అయితే ఇదే ఆసరాగా చేసుకొని సదరు ఇసుకాసురులు లబ్ధిదారుడికి ఐదారు ట్రాక్టర్లు పంపించి, మిగతా ఐదారు ట్రాక్టర్ల ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఒకే అనుమతి పత్రం పేరిట పదుల సంఖ్యలో అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల నిర్వాహకులు అనుమతులు పొందిన దానికి కంటే అదనంగా తరలిస్తుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకుంటే వారిపై స్థానికంగా ఉన్న నాయకులు, నియోజవర్గ ప్రజాప్రతినిధులతో చెప్పించి దురుసుగా చీవాట్లు పెడుతున్నారని ఆరోపణలున్నాయి.
స్థానికంగా ఇసుక ఉన్నా కొరతే..
జిల్లాలోని పలు గ్రామాల గుండా మూసీనది, బిక్కేరు వాగులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు ఇతరులు నిర్మించుకుంటున్న ఇండ్లకు ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర భవన నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇసుక దొరకక కొందరు ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు తెప్పించుకుంటున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ బహిరంగ మార్కెట్లో రూ.3వేల వరకు లభ్యం అవుతోంది. స్థానికంగా ఉన్న వాగులు, వంకల్లో ఇసుక లభ్యం కాకపోవడంతో ఉచిత ఇసుక దొరకని పరిస్థతి ఉంది. దీంతో లబ్ధిదారులు బహిరంగ మార్కెట్లోని ఇసుకపై ఆధారపడాల్సి వస్తోంది. బయట ఇసుక ధర విపరీతంగా వేలల్లో ఉండటంతో ఇండ్లు కట్టుకోలేక పోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెంచి స్థానికంగా ఇండ్లు నిర్మించుకుంటున్న వారికి తక్కువ ధరకు ఇసుక సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.