అర్వపల్లి మే 01 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను నాయకులు ఇష్టానుసారంగా ఇంట్లో కూర్చుని ఎంపిక చేసినట్లు తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి కేసాని రాహుల్ తెలిపారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ గురువారం అర్వపల్లి ఎంపీడీఓ గోపికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బొల్లంపల్లిలో పేదలు, వితంతువులకు కాకుండా తమ అనుచరులకు, భూములు ఉన్న వారిని ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రజా పాలనలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజల మధ్యలో కూర్చొని ఎంపిక చేయకుండా, ఇండ్లలో కూర్చుని సొంత నిర్ణయాలతో ఎంపిక చేసినట్లు దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ సభ నిర్వహించి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు.