మషీరాబాద్, మార్చి 18: దళితుల అభివృద్ధికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేరారు. దళిత బంధు పథకాన్ని ఎద్దేవా చేసి కాంగ్రెస్ సర్కార్ దాని స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షల ఇస్తామని చెప్పి 24 నెలలు అయినా 24 మందికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత యాతాకుల భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ నామమాత్రంగా ఉందని, రెండేళ్ల కాలంలో లక్ష రూపాయలైనా మంజూరు చేయలేకపోయారని విమర్శించారు.
త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ముందు గత రెండు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎలా ఖర్చు చేశారు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత యేడాది 21 వేల కోట్లు, అతకుముందు 40 వేల్ల కోట్లు కేటాయింస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖర్చు చేసిందో వెల్లడించాలని కోరారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు చేయడం విషయంలో నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ఊడిగం చేస్తున్నారే తప్ప దళిత సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, శ్రీకాంత్, సురేష్, శ్యామ్‌రావు, నర్సింహ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.