పెన్పహాడ్, ఆగస్టు 30 : కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. శనివారం పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ ఏజెంట్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు చెప్పారు. లింగాల -అన్నారం రోడ్డు నిర్మించాలన్నారు. మండల పరిధిలో చీదెళ్ల గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు అందివ్వాలన్నారు.
ఇటీవల కురిసిన వర్షాల మూలంగా దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతు చేపట్టాలన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో వార్డుల విభజన జరిపి ఎన్నికలు నిర్వహించాలన్నారు. రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం శాఖ కార్యదర్శి రణపంగ బుచ్చిరాములు, మాజీ ఉప సర్పంచ్ మామిడి భిక్షం గౌడ్. మాజీ వార్డు మెంబర్ రణపంగ పుల్లయ్య, లోడంగి మధు, రణపంగ అనిల్, నవనీత. సైదులు. సురేశ్ పాల్గొన్నారు.