సూర్యాపేట, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా 18 నుంచి 50 ఏండ్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అక్కౌంట్ కలిగి ఉండడం, అలాగే రూ.20తో 2 లక్షల ప్రమాద బీమా, రూ.436తో సాధారణ మరణం సంభవించినా బీమా కల్పించే స్కీమ్‌లో చేర్పించడం, అర్హులైన వారందరికీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలని లక్ష్యంగా పనిచేస్తున్నది.
అలాగేఆయుష్మాన్ భారత్, పీఎం పోషణ్ అభియాన్ తదితర పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాల్సి ఉంది. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా బ్యాంకుల భాగస్వామ్యంతో మేధావులతో ప్రచారం నిర్వహిస్తున్నది.
జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 16న ప్రత్యేక వాహనాలతో ప్రచారాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు ప్రచార వాహనాలు ఏర్పాటు చేయగా ఒక్కో వాహనంతో ఆయా ప్రాంతాల బ్యాంకులకు చెందిన ఇద్దరు ఉద్యోగుల చొప్పున ఆరు వాహనాల వెంట మొత్తం 12మంది ఉంటున్నారు. ఉదయం 12, సాయంత్రం 12 గ్రామాల చొప్పున రోజుకు 24 గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే చిన్న పంచాయతీలు ఉన్నచోట రోజుకు 30 నుంచి 35 గ్రామాలు పూర్తి చేస్తున్నారు.
గ్రామాల్లో సెంటర్ వద్ద వాహనాలు నిలిపి బ్యాంక్ అధికారులతో పాటు మేధావులు, ఇతర ఉద్యోగులతోపాటు గ్రామస్తులను ఆహ్వానించి వారికి సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. గ్రామాల్లోనే అకౌంట్లు లేని వారిని గుర్తించి అక్కౌంట్లు ఇప్పించడం, వారికి బీమా విలువలు తెలియజేస్తూ బీమా కల్పించడం, అర్హులైన కుటుంబాలకు ఉజ్వల గ్యాస్‌తో పాటు అన్ని సంక్షేమ పథకాలను కల్పిస్తున్నారు.