యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. పంట దిగుబడి అశించిన దానికంటే అధికంగా రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క ప్రకృతి కరుణించడంతో ఎకరానికి 45 నుంచి 50 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చినట్లు రైతులు చెప్తున్నారు.
– దామరచర్ల /మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 21
రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతుబంధు డబ్బులు సకాలంలో అందించడంతో రైతులు ఉత్సాహంగా సాగు చేశారు. దాంతోపాటు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా పుష్కలంగా సాగునీరు అందించింది. బోరు, బావులకు నిరంతర విద్యుత్ అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడం, కరకట్టలు తూములు ఏర్పాటు చేయడంతోపాటు సాగర్ జలాలతో నీటిని నింపడంతో జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భ జల మట్టం పెరిగి బోర్లు పుష్కలంగా పోశాయి. దాంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది.
ఎకరానికి 52 బస్తాల దిగుబడి
గతంలో దామరచర్ల మండలంలో కాల్వలు, ఎత్తిపోతలు, బోర్ల కింద 13వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుతం 17వేల ఎకరాల్లో సాగైంది. మిర్యాలగూడ మండలంలో ఈ యాసంగిలో సుమారు 45వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగునీరు పుష్కలంగా అందించడంతోపాటు ప్రకృతి కరుణించడంతో ఆశించిన దానికంటే అధిక దిగుబడి వచ్చింది. 1010 రకం ధాన్యం ఎకరానికి 52 నుంచి 55 బస్తాల వరకు రాగా.. సన్న రకం (చింట్లు) 42 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. సాగుకు అన్ని రకాలుగా సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం పండిన పంటను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. 1010 రకం ధాన్యం క్వింటాకు కొనుగోలు కేంద్రాల్లో రూ.2060కి కొంటున్నది. చింట్లు రకం ధాన్యం మిల్లుల్లో రూ.2400 నుంచి రూ.2600 వరకు ధర పలికింది. ఇప్పటికే చింట్లు రకం ధాన్యాన్ని మిల్లులకు తరలించగా.. 1010 రకం వడ్లను గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించారు.
వానకాలం నష్టం యాసంగి పూడ్చింది..
నాకున్న ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్న. వానకాలం దిగుబడి తక్కువై నష్టం వచ్చింది. యాసంగిలో వాతావరణం అనుకూలించింది. చీడపీడలు అంతగా ఆశించలేదు. ప్రభుత్వం కూడా సాగునీరు, కరెంటు పుష్కలంగా ఇవ్వడంతో పంట బాగా పండింది. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వచ్చింది. అన్ని ఖర్చులుపోను రూ.1.50లక్షలు మిగిలాయి. సంతోషంగా ఉంది
– బచ్చు సైదులు, ఊట్లపల్లి, మిర్యాలగూడ మండలం
కాలం కలిసొచ్చింది..
ఈ యాసంగిలో వరికి కలిసొచ్చింది. మాకు తండాలో ఆరు ఎకరాల భూమి ఉంది. మరికొంత భూమి కౌలుకు తీసుకొని కొంత చింట్లు, మరికొంత 1010 సాగుచేసినం. గవర్నమెంట్ కరెంట్ మంచిగా ఇవ్వడంతో నీరు పుష్కలంగా అందినై. దాంతో పంట బాగా పండింది. చింట్లు ఎకరానికి 46 బస్తాలు పండినై.
– లావూరి కవిత, వాచ్యాతండా