యాదగిరిగుట్ట, మే 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు. మాఢ వీధులు, క్యూలైన్లు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటికిటలాడాయి. స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చున్నారు. కొండ కింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది. స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. సుమారు 42 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
స్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి కల్యాణోత్సవసేవ జరిపారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని వీక్షించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.50,96,399 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
స్వామివారిని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నవల్జిత్ కపూర్, టీఎస్ఐడీసీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.