యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అధికార హస్తం పార్టీ మద్దతు దారులను మట్టికరిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఖంగుతినిపించింది. ఊహించని రీతిలో స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేదని నిరూపించింది. సగం స్థానాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని మండలాల్లో సగానికి పైగా కైవసం చేసుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగాయి. భారీ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది.
నాలుగు మండలాల్లో హవా
భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మొత్తం 126 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 118 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. సగం స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురేసింది. వలిగొండలో మొత్తం 37 స్థానాలు ఉండగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 18 స్థానాల్లో గెలుపొందారు. బీబీనగర్‌లో 34 స్థానాలు ఉండగా, 4 ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 12 సీట్లు గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ మండలంలోని రాఘవపురంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా.. రీకౌంటింగ్‌లో కేవలం మూడు ఓట్లతోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. పోచంపల్లిలో 21 స్థానాలు ఉండగా, ఒక చోట ఏకగ్రీవమైంది. బీఆర్ఎస్ మద్దతుదారులు 9 స్థానాలు కైవసం చేసుకున్నారు. భువనగిరి మండలంలో 34 జీపీలు ఉండగా, ఇందులో 18 మంది గులాబీ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. ఇక నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలోనూ గులాబీ పార్టీ కాంగ్రెస్‌కు చుక్కలు చూపించింది. ఇక్కడ 24 జీపీలు ఉండగా, రెండు ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. దీంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఏకంగా సొంత మండలంలోనే ఎదురుగాలి వీచిందనే అభిప్రాయం వినిపిస్తున్నది.
ఫలించిన పైళ్ల మంత్రాంగం
భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ ఫలితాలు సాధించడానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేసిన మంత్రాంగమే కారణం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఫలితాల వరకు ప్రతి అడుగు ఆచితూచి వేశారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, ఫలితాలు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. నిత్యం గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకర్షించారు. బీఆర్ఎస్ మద్దతుదారులకు ఎందుకు ఓటేయాలో ఓటర్లను ఆలోచింపజేసి సఫలీ కృతులయ్యారు.