వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతుండడంతో ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందుకొచ్చింది. యూన్సివర్సిటీలో నిపుణులతో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్‌గా దోమల రమేశ్‌ను నియమించింది. త్వరలో కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుండగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపు, సాయంత్రం 5:30 గంటల తర్వాత తరగతులు నిర్వహించనున్నారు. రెగ్యులర్ చదువుతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేలా సీఎం కేసీఆర్ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఆత్మసైర్థ్యం పెరుగడంతో పాటు సర్కార్‌పై విశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చదివే విద్యార్థులకు అండగా నిలిచేలా వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి విద్యతోపాటు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే యూనివర్సిటీలో కోచింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు కోచింగ్ సెంటర్ కో ఆర్డినేటర్‌గా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్‌ను నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని పోటీ పరీక్షలకు మహాత్మాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ దిశగా ఇటీవల నియామకమైన కో ఆర్డినేటర్ డాక్టర్ దోమల రమేశ్ నేతృత్వంలో ప్రణాళిక రూపొందిస్తూ ప్రారంభోత్సవానికి సన్నద్ధవుతున్నారు. 13 సబ్జెక్టుల్లో ఈ శిక్షణ ఇవ్వనుండగా ముఖ్యంగా అన్ని పోటీ పరీక్షల్లో ఉండే రీజినింగ్, ఆర్థమెటిక్, మెంటల్ఎబిలిటీకి తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిసింది. వీటితో పాటు మిగిలిన పది సబ్జెక్టుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్,గ్రూప్-2,3,4తోపాటు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు శిక్షణ అందించేలా కసరత్తు చేస్తున్నారు.
ఎంజీయూలో ప్రారంభించే శిక్షణ కేంద్రంలో యూనివర్సిటీలో జరిగే తరగతులకు ఇబ్బంది లేకుండా కోచింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల లోపు, సాయంత్రం 5:30 తర్వాతనే కోచింగ్ తరగతులు నిర్వహించనున్నారు. ఇదే అంశాన్ని త్వరలోనే వీసీ వెల్లడించి కోచింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక పుస్తకాలు సైతం అందుబాటులోకి తెస్తున్నారు. విద్యార్థుల కోరిక మేరకు అవసరమైతే యూనివర్సిటీ లైబ్రరీ పని గంటలు సైతం పెంచుతారని తెలిసింది
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కల్పించేలా ఎంజీయూలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పీజీ తరగతులు జరుగుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాంటి సమస్యలు గుర్తించి వీసీ సార్ నిర్ణయంవిద్యార్థుల్లో ఉద్యోగాలు సాధిస్తామనే భరోసా కల్పిచింది. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించి మా తల్లిదండ్రులు, అధ్యాపకులకు పేరు తేస్తా. కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తునందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-పులిగిళ్ల ఐశ్వర్య, ఎం.కామ్ ద్వితీయ సంవత్సరం
ఎంకామ్ చదువుతున్నా. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన వేస్తామని చేసినప్పటి నుంచి ఉద్యోగ సాధన వైపు ఆలోచన పెరిగింది. మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచే విధంగా వీసీ, రిజిస్ట్రార్ సార్లు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు రుణపడి ఉం టాం. త్వరగా శిక్షణను ప్రారంభించాలని కోరుతున్నా. ఉచిత కోచింగ్ ఇస్తున్నారని తెలవడంతో మా ఫ్రెండ్స్ అందరం సంతోషంగా ఉన్నాం.
– శ్రీకాంత్, ఎం. కామ్ ఎంజీయూ