నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన ఈ ఏడాదీ లేదు. ట్రిపుల్ఆర్, హైస్సీడ్ రైల్, ఇతర రైలు మార్గాలు, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు లాంటి డిమాండ్లకు మోక్షం లభించలేదు. జిల్లాకు సంబంధించి ఒక్క కేంద్ర విద్యాలయానికి చోటు లేదు. వైద్యపరంగా ఊరట లభించలేదు.
వ్యవసాయ రంగంలోనూ నేరుగా ప్రయోజనం కలిగే అంశాలు పెద్దగా లేవు. వేతనజీవులకు ఐటీ పరిమితి పెంపు లేదు. ఉపాధి హామీ పథకంపై ఆశలు వదులుకునేలానే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. జిల్లాకు సంబంధించిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులతో పాటు బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ర్టానికి, జిల్లాకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుత్సాహంగా, నిరాశాపూరితంగా ఉంది. ఉమ్మడి జిల్లాకు కీలకమైన పలు ప్రాజెక్టులకు ఈ సారైనా ప్రాధాన్యత దక్కుతుందని ఆశించారు.
ప్రపంచంలో అత్యంత అధికంగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడు నియోజకవర్గంలో గతంలో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శంకుస్థాపన చేసినా.. మరోసారి దాని ప్రస్తావన కనిపించలేదు. ట్రిపుల్ఆర్ నిర్మాణం టెండర్ల దశలో ఉన్నా దానికి సైతం నిధుల ఊసేలేదు. ఉత్తర భాగానికి ఎన్‌హెచ్-161ఏఏ నెంబర్ తాజాగా కేటాయించినా బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో డిమాండ్లుగా ఉన్న పలు విద్యాసంస్థలకు ఈసారీ గ్రీన్‌సిగ్నల్ రాలేదు. జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపై మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పింక్‌బుక్ వస్తేనేగానీ ఏం ప్రాజెక్టులు, నిధులు వచ్చాయో క్లా రిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.