రుద్రంపూర్, జూలై 27 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్గడ్డ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ‘బాల భరోసా’ కార్యక్రమంలో భాగంగా ‘తొలిముద్ద’ (ఉప్మా కిచిడీ) కార్యక్రమాన్ని కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల భరోసా కార్యక్రమం అభినందనీయమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే టిఫిన్ను రుచికరంగా, నాణ్యంగా, పరిశుభ్రంగా తయారు చేసి సకాలంలో అందించాలని అంగన్వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజలకు సూచించారు. చిన్నారులకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, శారీరక మరియు మానసిక వికాసం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.