హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బెంబేలెత్తిస్తున్నది. డిమాండ్ అమాంతం పెరుగుతున్నది. ఇదిలా ఉంటే పీక్ డిమాండ్ నమోదయ్యే సమయం కూడా అనూహ్యంగా మారిపోయింది. గతంలో ఉదయం 8-9 గంటల మధ్యలో పీక్ డిమాండ్ నమోదైతే.. ఈ ఏడాది పరిస్థితి తారుమారైంది. గత కొద్దిరోజుల నుంచి సాయంత్రంపూట డిమాండ్ నమోదవుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 3:29గంటల ప్రాంతంలో 18,739 మెగావాట్లుగా నమోదయ్యింది. ఇక సోమవారం 19,133 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదుకాగా, మంగళవారం కాస్త తగ్గింది.
ఈ నెల 9న ఉదయం 10:41 గంటల సమయంలో 19,543 మెగావాట్లు నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక డిమాండ్ కాగా, ఇటీవల సాయంత్రం పూట పీక్ డిమాండ్ నమోదవుతున్నది. ఇదిలా ఉంటే దక్షిణ డిస్కం పరిధిలతో మంగళవారం మధ్యాహ్నం 3:52 గంటల సమయంలో 12,044 మెగావాట్ల డిమాండ్‌తో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ నెల 11న మాత్రం మధ్యాహ్నం 12:44 గంటల సమయంలో 11,828 మెగావాట్లుగా ఉన్నది. ఇక గ్రేటర్ పరిధిలో సోమవారం సాయంత్రం 6:42 గంటలకు 4,072 మెగావాట్లు పీక్ డిమాండ్ (82.89 మి. యూనిట్ల వినియోగం) నమోదైంది. ఈవెనింగ్ పీక్ నమోదుతో విద్యుత్తు కొనుగోలుకు అధికారులు నానాతంటాలు పడుతున్నారు.