హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జెన్కో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ మేరకు అధికారులు యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. మంగళవారం సింగరేణి భవన్ నుంచి సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, జెన్కో సీఎండీ హరీశ్.. రెండు సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా 56 వేలు, రోడ్డు మార్గంలో 19,500 టన్నుల బొగ్గును సరఫరా చేసే ప్రణాళికపై చర్చించారు. ప్లాంట్ల వారీగా తీసుకుంటే కొత్తగూడెం విద్యుత్తు కేంద్రానికి 24వేలు, కాకతీయ థర్మల్ ప్లాంట్‌కు 4,500, భద్రాద్రికి 15వేలు, యాదాద్రికి 34వేల టన్నుల బొగ్గు అవసరమున్నదని అధికారులు ప్రస్తావించారు. యాదాద్రికి ఒడిశాలోని నైనీ నుంచి రెండు రేకుల ద్వారా 8వేల టన్నులు, సింగరేణి నుంచి ఆరు రేకుల ద్వారా 36వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు.