Fish | చేపలను వారానికి కనీసం ఒక్కసారైనా తినే పిల్లల్లో మేధో సామర్థ్యం మెరుగ్గా ఉండటంతోపాటు మంచి నిద్ర కూడా లభిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల మెదడు అభివృద్ధిలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వారానికి కనీసం ఒకసారి చేపలు తినే పిల్లలు ఐక్యూ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించే అవకాశముందని గుర్తించారు. అలాగే చేపలను ఎక్కువగా తినే పిల్లల్లో నిద్ర సంబంధిత సమస్యలు కూడా తక్కువగా కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. చేపల వినియోగం నిద్ర నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అధ్యయనం సూచిస్తోంది.
చేపలతోపాటు కొన్ని ఇతర ఆహారాలు కూడా పిల్లల మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. గింజలు, నట్స్‌లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడికాయ గింజల్లో ఉండే జింక్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అక్రోట్స్లో ఉండే ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును సమర్థవంతంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీ పండ్లు కూడా మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చడం వల్ల పిల్లల ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది.
ఆకుకూరలు పిల్లలకు అంతగా నచ్చకపోయినా, వాటితో రుచికరమైన వంటకాలు తయారు చేసి ఆహారంలో చేర్చడం మంచిది. వీటిలో ఉండే ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి9 (ఫోలేట్) వంటి పోషకాలు మెదడు కణాల అభివృద్ధికి అవసరమవుతాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొత్త మెదడు కణాల ఏర్పాటుకు, వాటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఇది తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.