Supreme Court : షెడ్యూల్డ్ కులాల (schedule casts) కు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా (SC status) తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి స్పష్టంచేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం.. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని, మతం మారిన మరుక్షణమే ఎస్సీ హోదా, దాని ఆధారిత ప్రయోజనాలు ముగుస్తాయని స్పష్టంచేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. పునఃపరిశీలన పిటిషన్ను తోసిపుచ్చింది.
ఒకవేళ ఎవరైనా తిరిగి ఎస్సీ హోదాను పొందాలంటే రాజ్యాంగం నిర్దేశించిన మూడు ప్రధాన నిబంధనలకు (పుట్టుకతో ఎస్సీ అయి ఉండటం, స్వచ్ఛందంగా తిరిగి సొంత మతంలోకి రావడం, మూల కుల సమాజం వారిని ఆమోదించడం) కట్టుబడి ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ విధానాలు, మత మార్పిడి వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.