సూర్యాపేట, మే 6: విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా.. చివరకు ఓ విద్యుత్ స్తంభం వేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల నుంచి కలిపి దాదాపు రూ.60 కోట్లతో ఇండెంట్ పంపించి రెండు నెలలు గడిచినా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. అలాగే ప్రకృతి వైపరిత్యాలతో విద్యుత్ వ్యవస్థకు ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే మరమ్మత్తులు చేపట్టేందుకు అత్యవసరం దృష్ట్యా ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ నిధులు వినియోగిస్తారు. ప్రస్తుతం ఆ నిధులు లేకపోవడంతో గాలిదుమారం వచ్చి ఆటకంకాలు ఏర్పడితే పరస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ నాడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆ శాఖ ద్వారా తెలిసింది.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. గత ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ అంటేనే ఓ పీడకల. రోజుకు నిరంతరాయంగా ఐదు గంటల సరఫరాకు కూడా నోచుకోకపోయేది. ట్రాన్స్ఫార్మర్ కాలితే ఐదారు రోజులకు కూడా వచ్చేది కాదు. ఇక వీధిలైట్లు మినుకుమినుకు మంటూ వీధుల్లో చీకట్లు అలుముకునేవి. వైర్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది. బట్టలు ఆరేసే దండేల మాదిరి వేలాడుతూ.. స్తంభాలు లేక కర్రల సాయంతో వైర్లను అమర్చే దుర్భర పరిస్థితి ఉండేది. అలాంటిది తెలంగాణ ఏర్పాటు అనంతరం అభివృద్ధికి మూలం నీళ్లు, విద్యుత్ అని భావించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు ఎంత అనేది లెక్కచేయకుండా రెండు రంగాలను ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా తీర్చిదిద్దడంతో దేశంలోనే తెలంగాణ జీడీపీ రికార్డు స్థాయిలో పెరిగిన విషయం విధితమే. ప్రధానంకగా ఇక్కడ విద్యుత్ విషయానికి వస్తే రైతులతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసింది. దీని కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏర్పాటు చేసింది.
కానీ గత ఎన్నికల ముందు ప్రజలను ఊహల పల్లకిలో ముంచి అలవికాని అబద్ధాలతో కూడిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకపోగా గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన పథకాలను కూడా అమలు చేయకుండా అన్ని రంగాలను కుదేలు చేస్తుంది. అలాగే నాడు వెలుగులు వెలిగిన విద్యుత్ కూడా నేడు కళ్ల ఎదుటే ఆగమైపోతోంది. కోతలతో వ్యవసాయం, గృహావసరాలకు నిరంతర విద్యుత్‌కు మంగళం పాడింది.
ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా జిల్లాలకు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఇంప్రూవ్మెంట్ నిధులు వస్తాయి. కానీ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు గడిచి జూన్ మాసం కూడా తొలి వారం గడిచిపోతున్నా ఇప్పటి వరకు నిధులు రాలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులోనే ఆయా జిల్లాల నుంచి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ కోసం ఎస్పీడీసీఎల్కు ఇండెంట్ పంపించడం.. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లడం జరుగుతుంది. ఆ నిధులను అవసరాన్ని బట్టి విడతల వారీగా విడుదలవుతూ వస్తాయి. వీటితో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, మిడిల్ పోల్స్, డామేజ్ పోల్స్, ఇంటర్ లింక్ లైన్స్ తదితర లోఓల్టేజీ నివారణకు కావాల్సిన చర్యలు చేపడతారు. వీటి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలోనే బడ్జెట్ వచ్చేది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సంవత్సరం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల నుంచి దాదాపు రూ.60 నుంచి రూ.65 కోట్లతో ఇండెంట్ పోయినట్లు సమాచారం. సూర్యాపేటలో రూ.15 నుంచి 20 కోట్లు, నల్లగొండలో రూ.35 నుంచి రూ.40 కోట్లు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.10 నుంచి రూ.12 కోట్లు అవసరం అని ఇండెంట్ పంపగా ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాకపోవడం గమనార్హం. దీంతో ఎక్కడైనా అత్యవసర పనులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొన్నింటిని కాంట్రాక్టర్లను బ్రతిమాలి చేయించడం.. మరి కొన్నింటిని వాయిదా వేస్తున్నారు. మూడు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం దాదాపు 250కి పైనే లోఓల్టేజీ సమస్యల వల్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉండగా అవి పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే చాలా చోట్ల విద్యుత్ సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాల్సి ఉంది.