అనంతగిరి, జులై 11 : నానో ఎరువుల వినియోగంతో మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ఇఫ్కో సూర్యాపేట జిల్లా మేనేజర్ ఏ.వెకటేశ్, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి చెందిన శాస్త్రవేత్త కిరణ్, ఎంఈ మార్క్ఫెడ్ దేవేందర్ అన్నారు. అనంతగిరి మండల కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో సంయుక్త ఆధ్కర్యంలో నానో యూరియా, డీఏపీ వినియోగంపై శుక్రవారం మునగాల, హుజూర్నగర్, మేళ్లచెర్వు, కోదాడ బ్రాంచ్ల సెక్రటరీలు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొదటిసారిగా యూరియాను ద్రవ రూపంలో తీసుకువచ్చిన ఘనత దేశానికి గర్వకారణం అన్నారు.
సత్వర ప్రయోజనం నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, నానో యూరియాను ఎలా ఉపయోగించాలో రైతులకు ప్రత్యక్షంగా చూపించాలన్నారు. నానో యూరియా వాడకం వల్ల ఖర్చు తగ్గడం, భూసార పరిరక్షణ, అధిక దిగుబడి సాధ్యమౌతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి ఏఓ అందె సతీశ్ పాల్గొన్నారు.