– ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, జూన్ 16 : ఎంటర్టైన్మెంట్ అండ్ టూరిజం రంగాల్లో యువతకు అపార అవకాశాలు ఉన్నట్లు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఎంజీయూ మేనేజ్మెంట్ కళాశాల ఎం.బి.ఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ – TTM) విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థులు రామోజీ ఫిల్మ్ సిటీలో 52 రోజుల ఇంటర్న్షిప్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో వారు టూరిజం విభాగంలోని గెస్ట్ రిలేషన్స్, ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్, మెర్చండైజింగ్ ఆపరేషన్స్ తదితర విభాగాల్లో శిక్షణ పొందారు. రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రంలో తమ విద్యార్థులకు అవకాశం లభించడం విశేషమని విభాగాధిపతి డా.జక్కా సురేశ్ రెడ్డి తెలిపారు. ఈ అనుభవం ద్వారా విద్యార్థులు పర్యాటకుల ఆతిథ్య సత్కారం, ఈవెంట్ అండ్ థీమ్ పార్క్ నిర్వహణ, సేల్స్ అండ్ మెర్చండైజింగ్ అంశాలపై తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు.
ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులను వర్సిటీ వీసీ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక–సాంస్కృతిక అభివృద్ధిలో టూరిజం రంగ ప్రాముఖ్యతను వివరించారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఎకో టూరిజంతో పాటు ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్, టూరిజం రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం రంగంపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఎంబీఏ టీటీఎం వంటి కోర్సులు విద్యార్థులకు టూర్ ఆపరేషన్స్, ట్రావెల్ ఏజెన్సీలు, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్స్, రిసార్ట్ మేనేజ్మెంట్, ఎయిర్‌లైన్, ఎయిర్పోర్ట్ సేవలు, థీమ్ పార్క్, ఫిల్మ్ టూరిజం వంటి విభిన్న రంగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు.