Nalgonda | నల్లగొండ: సీఎం రేవంత్ రెడ్డి నల్గగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులకు దిగారు. నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేతను సైతం అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
మునుగోడు మండలంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ సోషల్‌మీడియా యువనేత జంగిలి నాగరాజును ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సభలో ఫ్లకార్డు ప్రదర్శనతో నిరసన తెలుపుతాడన్న సమాచారంతో జంగిలి నాగరాజును పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Miryalaguda1
మరోవైపు మిర్యాలగూడలో నిరుద్యోగ యువత, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ నియామకాలపై న్యాయ విచారణ చేపట్టాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి నాయకులు ప్రకటించిన నేపథ్యంలో.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్, మున్సిపల్ ఫ్లోర్ లీడ్ ఇలియాస్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అక్రమ నియామకాలపై మౌనం పాటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులు హరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. విద్యార్థులను అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

Nalgonda1
అలాగే నల్లగొండ పట్టణంలోనూ వన్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరో డివిజన్ కార్పొరేటర్ కుందూరు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగోని రాజశేఖర్ రెడ్డి, 26వ డివిజన్ ఇంచార్జి ఒవైజ్ షా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాసిం, పట్టణ కార్యదర్శి బేరి నాగరాజు, మహమ్మద్ బషీర్, మహమ్మద్ రియాజ్, మహమ్మద్ నజీర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.