భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అనుమతులు లేకుండా మరికొన్ని అడ్డూఅదుపు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క ఫ్లోర్‌కు పర్మిషన్ తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించే కట్టడాలు పెరిగిపోతున్నాయి. అక్రమ కట్టడాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. మరోవైపు మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి పడుతోంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ జీవో నంబర్ 168 ప్రకారం అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలి. భువనగిరి మున్సిపాలిటీలో మాత్రం అధిక శాతం అనుమతులు తీసుకోకుండానిర్మాణాలు చేపడుతున్నారు. 150 అడుగుల వెడల్పున్న మెయిన్ రోడ్డులో కనీసం 6 నుంచి 7 మీటర్ల వరకు సెట్ బ్యాక్ ఉండాలి. 30 అడుగుల రోడ్డులో ముందుభాగంగా ప్లాటు విస్తీర్ణం మేరకు 1.5, 2.0, 3.0 మీటర్ల వరకు ముందు, వెనకాల సెట్‌బ్యాక్ వదలడంతో పాటు పక్కలకు 1.5 మీటర్ల ఖాళీ వదిలి నిర్మాణాలు చేపట్టాలి. వినాయక చౌరస్తా, ఆర్బీనగర్, ఠాగూర్ రోడ్డు, నల్లగొండ రోడ్డు, సీతానగర్, జిల్లా దవాఖాన, గంజ్, రాంనగర్, బైపాస్ మార్గంలో పెద్దఎత్తున నిబంధనలు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్‌బ్యాక్ వదలడం పక్కన బెడితే.. రోడ్డుపైకి వచ్చి మెట్లు, పై అంతస్తు స్లాబ్ వేస్తున్నారు.
ఇండ్ల నిర్మాణాలు, అనుమతులను టౌన్ ప్లానింగ్ విభాగం మానిటర్ చేస్తుంది. పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారే కరువయ్యారంటే మున్సిపల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతుల మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అని అధికారులు పరిశీలించడం లేదు. ఇక అనేకచోట్ల భవనాలు పూర్తయినా అధికారులు అసెస్మెంట్ చేసి.. ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. అక్రమ కట్టడాలు గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అస్సెస్మెంట్ చేయకపోవడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని సందర్భాల్లో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లగానే కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. ఆ తర్వాత పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. టౌన్‌ప్లానింగ్ అధికారి నరేశ్‌ను సంప్రదించగా.. పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు జరుగుతున్నాయని, నోటీసులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.