భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 9 : భూదాన్ పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దానిని తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. ఐఐహెచ్‌టీ సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఐఐహెచ్‌టీని కేంద్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలోని హ్యాండ్లూమ్ పార్కులో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. కనుముకులలో సదుపాయాలు కల్పించే వరకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే తాత్కాలికంగా నడిపించనున్నారు. సంప్రదాయ వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తిలో ఆధునికత సాంకేతికను జోడించి యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐహెచ్‌టీ బాటలు వేస్తుంది.
చేనేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెం, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఐఐహెచ్‌టీకి తాజాగా దరఖాస్తులు స్వీకరించింది. కనుముకుల హ్యాండ్లూమ్ పార్కులోని భవనాలను ఐఐహెచ్‌టీ కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. అక్కడ సరైన సదుపాయాలు లేనందున అధికారులు ఈ సంవత్సరం తాత్కాలిక హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 ఐఐహెచ్‌టీలు ఉండగా తెలంగాణకు మంజూరైన సంస్థతో కలిపి 12కు పెరిగాయి.
ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉన్నాయి. ఇందులో మూడేండ్ల హ్యాండ్లూమ్, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులు ఉండగా, అర్హులైన చేనేత కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500, కేంద్ర ప్రభుత్వం రూ.5000 చొప్పున ఉపకార వేతనం ఇస్తాయి. సెప్టెంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.