మునుగోడు, మే 23 : పంచాయతీ కార్యదర్శుల పనితీరును బట్టి గ్రామాల అభివృద్ధి ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో మండలంలోని గ్రామాల అభివృద్ధి, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై జిల్లా పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమర్థవంతంగా పనిచేసే కార్యదర్శుల వివరాలను ఆరా తీశారు. సమర్థవంతంగా పనిచేసే వాళ్లే ఇక్కడ ఉండాలని, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఇక్కడ ఉండొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల్లో వాతావరణం బాగుండే విధంగా, గ్రామాలు అద్దంలా మెరిసేలా, మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఇన్చార్జి ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూప, స్థానిక నాయకులు పాల్గొన్నారు.