సూర్యాపేట, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా? మా గోడు వినిపించేందుకు అని సెక్రటేరియట్‌కు వెళ్తుంటే అక్రమంగా అడ్డుకుని స్టేషన్లకు తరలిస్తారా? ఇదేం ప్రజా పాలన’ అంటూ మాజీ సర్పంచ్‌లు మండిపడుతున్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో మాజీ సర్పంచ్‌లు శుక్రవారం తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ముందస్తు అరెస్టులు చేసి మాజీ సర్పంచ్‌లను పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాంతో పలుచోట్ల మాజీ సర్పంచ్‌లు స్టేషన్ల ఎదుటే నిరసన తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ ముందస్తు అరెస్టులు కొనసాగాయి. సూర్యాపేట జిల్లాలోని మోతె, తిరుమలగిరి, ఆత్మకూర్.ఎస్, నాగారం మండలాల్లో పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్, కేతేపల్లి, వేములపల్లి, దేవరకొండ మండలాల్లోనూ అరెస్టులు కొనసాగాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, మోత్కూరు మండలాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. ఎలాగోలా హైదరాబాద్‌కు చేరిన మోత్కూరు మండల మాజీ సర్పంచ్‌లను అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. బీబీనగర్ మండలంలోని రహీంఖాన్‌గూడెం గ్రామ మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోగా, రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్‌లు మండిపడుతున్నారు.