– ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్
నీలగిరి, మే 09 : ఎస్బీఐ ఉద్యోగుల 16 రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్ హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ల అధ్వర్యంలో శనివారం నల్లగొండ ఎస్బీఐ ఏఓ కార్యాలయం ఎదుట దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫెడరేషన్ లేవనెత్తిన 10 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు చేపట్టాలని, ఆర్మ్డ్ గార్డుల నియామకం చేయాలని, ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్చుకునే అవకాశం కల్పించాలని, 2013 తరువాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగాల ఔట్ సోర్సింగ్‌ను నిలిపివేసి తగిన సిబ్బంది నియామకం చేయాలన్నారు.
ఇప్పటికే పలు దశల పోరాటాల్లో బాగంగా ఈ నెల 4వ తేదీన బ్యాడ్జ్ ధరించడం, 5న శాఖల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు, మే 6న ట్విట్టర్ క్యాంపెయిన్ చేసినట్లు తెలిపారు. అయినా ఎస్బీఐ యాజమాన్యం నుండి స్పందన రాకపోవడంతో దర్నాలకు పిలుపునిచ్చామని అయిన స్పందించకపోతే రాబోయే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను ఉద్యోగుల హక్కులు, గౌరవం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ భవిష్యత్ పరిరక్షణ కోసం విజయవంతం చేయాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీలు ఎం.ప్రవీణ్ కుమార్, జి.వి.సుబ్బారావు, అసిస్టెంట్ ట్రెజరర్ ఎస్.జీవన్ కుమార్, రీజినల్ సెక్రటరీలు ఎస్.నరసింహ, నరేష్, మహేష్, రాంబాబు, నరేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు టి.మాధవ రెడ్డి, సైదులు, భ్రమరాంబ, రాములు, ఎన్.వి.టి. పాల్గొన్నారు.